Saturday 31 January 2015

కొత్త రుతువు

కొత్త రుతువు
ఉషా యస్ డానీ

నిజానికి  మన కథ ఎప్పుడో మొదలయింది. కనీసం అంతకు ముందు రాత్రయినా మొదలయి వుండాలి. అప్పుడు ఆ సంగతి మనకు తెలీదు. మర్నాడు ఉదయం తెలిసింది. అంచేత మర్నాడు ఉదయమే కథ మొదలయింది అనుకుందాం ఉపోద్ఘాతం పూర్తిచేసి ఓసారి వెంకట్రత్నం కేసి చూశాడు సర్కిల్ ఇనెస్పెక్టరు పోతరాజు.
పొతరాజు కుర్చీ వెనక గాంధీగారి పటం కింద కొత్తగా ఓ పులి పటం వేలాడుతోంది. దాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు వెంకటరత్నం.
వెంకట్రరత్నం ఆ స్టేషనులోనే సర్కిల్ ఇనెస్పెక్టరుగా పన్చేశాడు. ఉద్యోగం అయితే రెండేళ్ల క్రితమే రిటైర్ మెంటు ఇచ్చేసింది. ఆయన మాత్రం స్టేషన్ను వదల్లేక ఇంకా చూరుపట్టుకుని వేలాడుతున్నాడు; కోరికలు తీరక చచ్చినోడిలా! .
మామూలుగా అయితే స్టేషన్ కు వచ్చిన కేసుల్లో చాలా వరకు ఎఫ్ ఐఆర్ కు ఎక్కవు. అలా ఎక్కిన కేసుల్లోనూ చాలా భాగం చార్జిషీటు వరకురావు. మధ్యలోనే మాయం అయిపోతుంటాయి. స్టేషన్ హౌస్ ఆఫీసర్లలకు ఇదో వెసులుబాటు అనవచ్చు. ఎందుకంటే  చాలామంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు  పకడ్బందీగా చార్జిషీట్లు రాయడం రాదు. రాసిన చార్జిషీటు న్యాయస్థానంలో నిలబడకపోతే డిపార్టుమెంటులో అదో ఇబ్బంది. అంచేత ఎప్పుడయినా ఓ కేసులో చార్జి షీటు పెట్టాల్సివస్తే, పెద్దాడుకదా అని వెంకట్రత్నానికి కబురు పెడుతుంటాడు పోతరాజు. ఎంతోకొంత ముడుపులు చెల్లించుకుని సలహాలు లా పాయింట్లు ఉపదేశించుకుంటుంటాడు.
గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకుని మళ్ళా కథ మొదలెట్టాడు పోతరాజు.
లేవంగానే ఏ దేబ్రాసీ మొఖమో చూడాల్సిన ఖర్మ బేబీకు లేదు. తెల్లారంగానే అద్దం ముందు కూర్చొని తన ముహం తానే చూసుకుంటుంది. ఎప్పట్లానే ఆరోజు ఉదయాన్నే లేచింది. ఎప్పట్లానే అద్దం ముందు చేరిపోయింది. ఎప్పట్లానే తన అందం చూసుకుని మురిసిపోయింది. ఎప్పట్లానే ఏవో విచిత్ర లోకాల్లో తేలిపోయింది. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మెడ బోసిగా అనిపించి ఉలిక్కిపడింది. ఓసారి గట్టిగా గాలి పీల్చుకున్నాడు పోతరాజు.
రాత్రి బేబీ వాళ్ళ అంకుల్ వాళ్ళ పెద్దబ్బాయి సరిగ్గా ఆ మెడ దగ్గరే సుతారంగా ముద్దు పెట్టుకుని ఐ లైక్ ఇట్అన్నాట్ట. ఆ కుర్రాడు అలా మెచ్చుకున్నది   బీర్ మగ్గులాంటి తన మెడను చూసో, మెడలోని గొలుసును చూసో – రాత్రంతా ఆలోచించినా ఈ పిచ్చిపిల్లకు అర్ధం కాలేదట, తెల్లారే సరికి మెడ అయితే వుందిగానీ, ఆ మెళ్ళో ఉండాల్సిన గొలుసుకాస్తా మాయమైపోయింది."

ఓసారి ఊపిరి పీల్చుకున్నాడు పోతరాజు. 

క్షణాల్లో బేబీవాళ్ళ మేడంతా అట్టుడికి పోయింది. నిముషాల్లో ఊరుఊరంతా అల్లకల్లోలమైపోయింది.  బేబీ డాడీ యస్సైతో మాట్లాడేడు. బేబీవాళ్ళ అన్నయ్య నాతో మాట్లాడేడు. బేబీ డీయస్పీ ముందు మాట్లాడలేక, గొలుసు గుర్తుకువచ్చి వెక్కివెక్కి ఏడ్చేసింది” - పోతరాజు ఆగాడు."
"థెప్ట్ కేసు"
"వాడే ఆ అంకుల్ కొడుకే"
"క్లియర్ కేస్"
"అది వాళ్లకూ తెలుసు. నాకూ తెలుసు. ఆ ముక్క బయట చెపితే  ఇక నా బతుకు రంప చోడవరమే" 
పేపర్ వెయిట్ ను బొంగరంలా తిప్పుతూ కొడుతున్నాడు వెంకట్రత్నం.
మేడమ్, ఐ మీన్ బేబీ తల్లి యస్పీని కాంటాక్టు చేసి మా ఇంట్లోనే ఇలా జరిగితే ఇక సామాన్యుల సంగతేంటీ? అని కేకలేసింది. ఆ తల్లి అంతటితో ఊరుకోలేదు. హైదరాబాద్ లో వాళ్ళ అన్నయ్య ఫోన్ నెంబరు కనుక్కొని చెప్పమంది
యస్పీ అంటే ఏమైనా టెలీఫోన్న్స్ ఆప్పరేటరా?   వాళ్లన్న ఫోన్ నెంబరు యస్పీ కెలా తెలుసుద్దీ? చికాగ్గ అడిగేడు వెంకట్రత్నం.
అదేగురూ! అసలు పాయింటు. మేడమ్ వాళ్ళ అన్న హోం మినిస్ట్రీలో పెద్ద ఆఫీసరట.
మైగాడ్
అప్పుడే ఏమయిందీ? అక్కడెక్కడో ఎమ్మెల్యే వీళ్లకేదో దూరపు చుట్టం అవుతాట్టా. రేపు శాసనసభలో వాడు ఈ కేసుని లేవనెత్తుతాడంటా.
పోతరాజూ! నీ పాపం పండినట్టుందయ్యా అన్నాడు వెంకటరత్నం తాయితీగా.
అంతమాట అనకు గురూ. ఇన్నిసార్లు ఆదుకున్నావు. ఇంకొక్కసారి గట్టెక్కించి పుణ్యం కట్టుకో పోతరాజు గొంతు వణుకుతోంది. ఆ వణుకు చూస్తే వెంకట్రత్నానికి కొంచెం కైపెక్కినట్టు వుంది.
ఎస్పీ దొర ఏమంటున్నాడూ?
వాడేమంటాడూ? రెండ్రోజుల్లో దొంగను చూపించకపోతే పరువు దక్కదన్నాడు”. ఈసారి పోతరాజు ఒళ్ళంతా వణికింది.
దొంగను చూపించమన్నాడు. అంతేగా! డిపార్టుమెంటులో వున్నాక దొంగల్ని చూపించడానికేం? రాజాలా చూపించవచ్చు. ఇంతకీ మేడమ్ సంగతేంటీ? ఈ రెండ్రోజుల్లో కాస్తయినా తగ్గిందా?
ఆ తల్లా! తగ్గేదీ? వనూలమ్మో పోసమ్మో ఎక్కేసేయి. రెండు దున్నల్ని బలిస్తేనేకానీ ముందు ఆ తల్లి పూనకం దిగేట్టు లేదు
ఇది ఇబ్బందేనయ్యా. దొంగను చూపించవచ్చు. కాదూకూడదు అంటే ఆ బంగారు గొలుసూ చూపించొచ్చు. కానీ, ఆ దొంగ దున్నలా వుండాలంటే మాత్రం  కొంచెం కష్టమే
నాకు తెలీకేకదా గురూ నిన్ను శరణుకోరిందీ?
కంగారు పడిపోకా. ఎదుటోడికి ఏం కావాలో తెలిసిందంటే చాలు  మనం సగం విజయం సాధించేసినట్టే. ఆ విషయంలో నువ్వు అదృష్టవంతుడివి. ఇక ఆ పుణ్యకార్యం కానించేయడమే తరువాయి. ముందు ఆ తల్లి శాంతిచేటట్టు చేయండి
వెంకట్రత్నం ముఖాన్నీ, మాటల్నీ కళ్ళూ చెవులూ అప్పగించి వింటున్నాడు పోతరాజు.
"ఇప్పుడు మనం ఒక బంగారు గొలుసు సంపాదించాలి. ఓ దొంగను సృష్టించాలి. వాడో దున్నలా వుండాలి వాడ్ని  లాకప్పులో పెట్టి నాలుగు తన్నాలి" - ఆలోచనలో పడ్డాడు పోతరాజు.
చూడు పోతరాజూ! ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. ఇదిగో ఇప్పుడు మరోసారి చెపుతున్నా. మనం ఉత్త నిమిత్తమాత్రులమేనయ్యా.  గోడకున్న పటం కేసి చూస్తో, సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మలా అన్నాడు వెంకట్రత్నం.
పటంలోని జాతీయ మృగం జాతిపిత కేసి చిత్రంగా చూస్తో వికారంగా ఆవులించింది.
--- // --

ప్రతి వృత్తికీ ఓ ప్రత్యేక స్థలం వున్నట్టు ఓ ప్రత్యేక వాసన వుంటుంది. పోలీసులకు అలాంటి ప్రత్యేక వాసన వున్నట్టు అనిపించదు. అలాగని అసలు ఏ వాసనా ఉండదనీకాదు. సానికొంపల్లో, కసాయి దుకాణాల్లో, కోళ్లఫారాల్లో, పెంటకుప్పల్లో వుండే వాసనలన్నీ   కలగలిసిపోయి పోలీసుస్టేషన్లలో కాపురం చేస్తుంటాయి.
మరునాడు తెల్లారేసరికి స్టేషనంతా గుప్పున పోలీసు వాసనలతో తొణికిసలాడుతోంది. ప్రహరీ గోడకు ఆనుకుని ఎవరో ముసిలోడు గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు.
కొండంత అండరోయ్ దేవుడా! దున్నలాంటి కొడుకురోయ్ దేవుడా! దొంగతనం మోపి   పీనుగును చేసేశార్రోయ్ రాక్షసులు!
 ఓ నీలంరంగు పోలీసు వ్యాన్ సర్రున దూసుకుంటూవచ్చి స్టేషన్ ముందు ఆగింది. నలుగురు పోలీసులు కలిసి లాకప్ నుండి ఓ శవాన్ని మోసుకుంటూ, గేటుకు అడ్దంగా వున్న ముసిలోడ్ని తోసుకుంటూ, రోడ్డు మీదికి వచ్చారు.
ఉండుండి రోడ్డు మీద జనం పలచబడిపోయారు. ఊరంతా చావు వాసనా. చావు చీకటి. అందరి కళ్ళల్లో చావు భయం.
శవానికి ఇరవై యేళ్ళుంటాయి. భారీ శరీరం. ముసిలోడు ఏడుస్తున్నట్టు నిజంగానే దున్నలాంటి ఒళ్ళు.
శవం ఒళ్ళంతా గాయాలతో ఎర్రగా నీలంగా కందిపోయివుంది. మోకాలి చిప్పలు పగిలిపోయాయి. కీళ్ళు పట్టుజారి కాళ్ళూ, చేతులూ పొట్లకాడల్లా వేలాడుతునాయి. ముక్కెమ్మట కారిన రక్తం నల్లగా అట్టలు కట్టింది. నోటెమ్మట ఏదో పల్చటి ద్రవం బంకలా జారుతోంది. దానిమీద ఈగలు వాలి ఏదో జుర్రుకుంటున్నాయి.
ఫోలీసులు ఓసారి రోడ్డంతా పరికించారు. ఓ నిర్ధారణకు వచ్చి శవాన్ని, ముసిలోడ్నీ ఎత్తి వ్యాన్ లోకి విసిరేశారు.
మళ్ళా వీడెందుకూ? ఓ పోలీసు అడిగాడు.
పంచనామాకు పనికివస్తాడు? మరో పోలీసు సమాధానం చెప్పాడు.
జరుగుతున్నది ఏమిటో అర్ధం కావడానికి ముందే ఆ పోలీసు వ్యాన్ జిల్లా ఆసుపత్రి కేసి పరుగెత్తింది.
--- // --


 పోస్ట్ మార్టం గది తలుపులు నల్లరంగులో మృత్యుకళతో మిలమిలా మెరిసిపోతున్నాయి. ముసిలోడు మగతలో నుండి స్పృహలోనికి వస్తున్నాడు. తన కొడుకు ఇక లేడని నెమ్మనెమ్మదిగా, అయిష్టంగా అయినా నమ్మకతప్పడం లేదనికి. బిక్కుబిక్కు మంటూ అటూఇటూ చూశాడు. పోలీసులుతప్పా వరండాలో మరెవరూలేరు.
తనకు మరోదిక్కువుంటే తాను ఏకాకి కాకుండావుంటే ముసిలోడు ఇంతటి బాధని  కొంతయినా భరించగలిగేవాడేమో. మనిషికంటూ మరో మనిషి లేకపోవడం కొడుకు చనిపోవడంకన్నా బాధాకరం. బాధల్లోవున్న మనిషి పోలీసుల మధ్య వుండాల్సిరావడం ఆ చావుకన్నా ఘోరం.
తన మీద ప్రేమలేదనీ, తనను ఒంటరిగా వదిలేశారనీ, కొడుకు అనుకుంటాడేమోనని అనుమానమొచ్చి ముసిలోడి పేగులు అల్లాడిపోయాయి. కొడుక్కి ఒక్క నిముషం ప్రాణమొస్తే, వాడి కడుపులో తలపెట్టి భోరున ఏడ్వాలనిపించింది.
ఈలోపు, ఆ నల్లతలుపుల్ని తోసుకుంటూ తెల్లటిదుస్తుల్లో ఓ డాక్టరు బయటికి వచ్చాడు.
నువ్వేనా శవం తాలూకు మనిషివీ?
చిత్తం బాబూ
ఏమవుతావు వాడికీ?
నా బిడ్డయ్యా. ఒక్కగానొక్క కొడుకు. బంగారంలాంటి ...
ముసిలోడి మాటల్ని  పూర్తికానివ్వలేదు డాక్టరు.  జేబులోంచి ఒక చిన్న సీసా తీసి మూసిలోడికి చూపించి ఇదేంటో తెలుసా? అనడిగేడు.
సీసాలో జేగురు రంగులో ఏదో ద్రవం వుంది. ముసిలోడు సిసాకేసీ, సీసాలోని ద్రవంకేసీ, డాక్టరు ముఖం కేసీ, వెర్రిగా, పిచ్చిగా, అనుమానంగా చూశాడు.
విషం. వాడి కడుపులో వుంది అన్నాడు డాక్టర్. అతని గొంతు మెత్తగా, గంభీరంగా, వెన్న ముద్దలా వుంది. 
సున్నితమైన ఆ డాక్టరు మాటలు మొరటు ముసిలోడికి అర్ధంకాలేదు.
పురుగుల మందు అంత అజాగ్రత్తగా ఎందుకు వుంచావూ? అని మందలించాడు డాక్టరు.
పురుగుల మందేంటీ బాబూ? మావాడి కడుపులో వుండడం ఏంటండీ? తాటిచెట్టులాంటి వాడ్ని నా ముందే కుమ్మేశారండి పోలీసులు. నా బిడ్డ మీద ఒట్టు. నేను కళ్ళారా చూసేనండి
ముసిలోడి ఏడుపుకు డాక్టరుబాబు అడ్డొచ్చాడు.
డాక్టర్ని. నేను చెపుతున్నాగా. మీవాడు పురుగుల మందు తాగి చచ్చాడు. తండ్రి మనసుకదూ? నీ బాధ నాకు తెలుసు. బిడ్డపోతే అల్లాడిపోతుంది. నీకు అనుమానం వుంటే చెప్పు. నీ కొడుకుని ఎక్కడ కోయమంటే అక్కడ కోస్తా. ఎక్కడ చూపెట్టమంటే అక్కడ విషం చూపిస్తా?
ముసిలోడికి కాళ్ళ కింద భూమి కుంగిపోతున్నట్టుగా అనిపించింది.
అన్యాయం డాక్టరు బాబూ! బంగారంలాంటి బిడ్డండి బాబూ!  కల్లాకపటం తెలీనోడండి. కడుపులో ఏదో కుళ్ళు పెట్టుకుని అంతలేసి మాటలు అనేయకు బాబూ!
డాక్టరుబాబు ముసిలోడికేసి వేదాంతిలా చూసి మందహాసం చేశాడు.
చూపెట్టమనడంలో తప్పులేదు. నువ్వు అడగవచ్చు. అది నీ హక్కు. డాక్టరుగా చెప్పడం నాధర్మం. మీవాడి గుండెకాయ, కార్జం చీల్చమంటే చీల్చుతా. ఉలవకాయలు, కర్పూరాలు పీకి చూపించమన్నా చూపిస్తా. నువ్వు నరకమంటే చాప్స్, నాన్ బారు, మూలుగులు, బొయికలు, కాళ్ళూ నరుకుతా. నువ్వు నమ్మడమే ముఖ్యం. అప్పటికీ నమ్మకం కుదరకపోతే నాలుక, మెదడూ కోసి చూపిస్తా. ఎక్కడయినా విషం వుంటుంది. ఉద్రేకం పడిపోక. నేనున్నానుగా. నామాట నమ్ము.
ముసిలోడి పుత్రవాత్సల్యాన్ని డాక్టర్ సరిగ్గానే అంచనా వేశాడు. అతని గురి తప్పలేదు. దెబ్బ తగలాల్సిన చోటే తగిలింది.
ముసిలోడు తెల్ల డ్రెస్సుకేసీ, నల్లతలుపులకేసీ మరోసారి వెర్రిగా చూసి మరింత వణికిపోయాడు. వాడికళ్లల్లో కొడుకు రూపం చెదిరిపోయి రక్తంకారుతున్న మాంసపు గుట్టలు కనిపించసాగాయి. కొడుకుని అంత వికృతంగా తలవడంకన్నా వాడి కడుపులో విషం వుందని ఒప్పుకోవడమే   నయం అనిపించింది.
భయంతో, నిస్సాహాయతతో ముసిలోడి ఒళ్ళు తిమ్మిరెక్కి స్పృహ కోల్పోతున్నట్టు తల తిరిగిపోతున్నట్టు అనిపించింది. తన్నుతాను సంభాళించుకోలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాడు.
నీ కాళ్ళు పట్టుకుంటా డాక్టరుబాబూ! నోరారా ఒక్క మాట చెప్పు. ఒళ్ళంతా విషం నింపుకున్నోళ్ళు వాడి ఒళ్లంతా కాటేశారని చెప్పు.
ఆ తరువాత ముసిలోడికి నోటెంట మాట రాలేదు. ఉండుండి డాక్టరు భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపేశాడు. వాడికి ఏడుపు ఆక్రోశం రెండూ ఒక్కసారే వచ్చాయి. అల్లంత దూరాన వరండాలోవున్న పోలీసులు ఈ గొడవకు పరుగెత్తుకు వచ్చారు.
ఇక తన పని అయిపోయినట్టు నల్లతలుపుల్ని తెరుచుకుని గంభీరంగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయేడు డాక్టరు బాబు. 
ఆ తరువాత డీయస్పీ వచ్చి ముసిలోడ్ని వరండా మూలకు లాక్కెళ్ళిపోయాడు.
సరేరా. పోలీసులే చంపేశారు అనుకో. మరి నువ్వు చేసిన నిర్వాకం ఏంటీ? చచ్చినోడ్ని ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టించేయడానికి సిధ్ధం అయిపోయేవు కదరా?- అనునయంగా  గద్దించాడు డీయస్పీ.
ముసిలోడికి అంతా అయోమయంగా వుంది. కీళ్ళు పట్టుతప్పి గోడకు జారగిల పడిపోయాడు.
పోలీసులు సామాన్లన్నీ సర్దుకున్నారు. పీనుగును చాపలో చుట్టి వ్యాన్ ఎక్ల్కించారు. వ్యాన్ స్టార్టు అయింది. డీయస్పీ స్వయంగా ముసిలోడ్ని భుజం పట్టిలేపి, నెమ్మదిగా నడిపించుకుంటూ వ్యాన్ దగ్గరికి వచ్చాడు. 
ఏడ్వమాక ముసిలోడా! ఏడ్చి ఏం లాభం చెప్పు. చచ్చినోడు ఎట్లాగూ చచ్చేడు. చావు రమ్మంటే అందరికీ రాదురా. దానికీ రాత వుండాలి. వాడికి వచ్చింది. పోయేడు.  శవాన్నీ అన్ని ఇబ్బందులు పెట్టి గలీజు గలీజు చెయ్యకూడదురా. నలుగురి నోట్లో నానెయ్యక ముందే ఇక జరగాల్సిందేదో ఆలోచించు. నామాట విని ఆ కట్టే కాస్తా కుళ్ళిపోకముందే కాటికి చేర్చి కాల్పించే ఏర్పాట్లు చెయ్యి. పీనుగు కంపు కొట్టిందని ఎవరికైనా తెలిస్తే ఎంత అపచారం? ఎంత నామోషీ? ఎంత అప్రదిష్ట? - ముసిలోడ్ని ఓదార్చేడు డీయస్పీ. 
సిఐని పిలిచి, ఏవోయ్ పోతరాజూ! ముసిలోడి దగ్గర డబ్బులు ఉన్నాయోలేవో. కాటి దగ్గర కక్కుర్తేంటిగానీ నాలుగు పుట్లు మాంఛి ఎండుపుల్లలు వేయించి శవాన్ని దగ్గరుండి కాల్పించు. అన్నాడు.
పోతరాజు తలూపాడు.
"అలా తలూపడం కాదూ. చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. చూసి రమ్మంటే కాల్చి వస్తావు.  కాల్చి రారా అంటే సగంలో వదిలిపెట్టి వస్తావు. "
పోతరాజు  ఈసారి అడ్డంగా  తలూపాడు.
" లాకప్ లో పెట్టి నాలుగు తన్నమంటే లాకప్పు డెత్తు చేయమనికాదు" - దాదాపు గొణిక్కుంటున్నట్టు అన్నాడు డియస్పి.
 ఆదేశాలు, ఉపదేశాలూ పూర్తయ్యాక వ్యాన్ కదిలింది.
 పూర్ ఫెలో! అంటూ ముసిలోడి భుజాన్ని ఇంకోసారి ఒదార్పుగా తట్టి డీయస్పీ కూడా వెళ్ళిపోయాడు.
ఆరాత్రి, ఒకానొక నిర్మానుష్య ప్రదేశంలో ప్రభుత్వలాంఛనాలతో, పోలీసు వందనాలతో ముసిలోడి కొడుకు అంత్యక్రియలు జరిగేయి.
---- // ----

నిజానికి మన కథ అప్పుడే ముగిసేదికాదు. కనీసం మరి కొన్నాళ్లయినా కొనసాగి వుండేది. కానీ, ఆ మరునాడు జరక్కూడనిది జరిగిపోయింది. అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా అలా జరిగిపోయింది కనుక ఇక ముగింపు మొదలయిందనే అనుకుందాం.
ఆ మరునాడు ఏలినవారూ వారి సంరక్షకులూ బలహీనంగా వున్నారు. వాళ్ళు మనుషుల్ని చంపి బూడిదగా మార్చెయ్యగలిగారు. కానీ, వాళ్ల కోసం ఆ పని చేసిపెట్టిన పోలీసు స్టేషన్  బూడిదైపోకుండా కాపాడలేకపోయారు!.
మంటల్ని ఆర్పడానికి వచ్చిన ఫైరింజన్లు నిస్సహాయంగా చూస్తుండి పోయాయి.

సుఫియా కుటీరం
20 సెప్టెంబరు  1987

ప్రచురణ : అరుణతార, అక్టోబరు, 1987