Friday 13 January 2017

ROTI PACHCHADI

రోటి పచ్చడి
(కరువు చెప్పిన కథలు)
డానీ

భోజన ప్రియులకు కృష్ణాజిల్లా అంటే బోలెడంత ఇష్టం. కృష్ణాజిల్లా అనంగానే రోటి పచ్చళ్ళు గుర్తుకు వస్తాయి. రోటి పచళ్లకూ, గడ్ద పెరుగుకూ మంచి జోడి. పశ్చిమ కృష్ణాజిల్లాలోని మెట్త ప్రాంతాలు గడ్డ పెరుగుకు పెట్టింది పేరు.

ఎండ కొంచెం ఎక్కువన్న మాటేగానీ రోటి పఛట్లో నేతి చుక్క వేసుకుని అన్నంలో కలుపుకుంటే రుచే వేరు. మారు అన్నంలో గడ్దపెరుగు వేసుకుని నాలుగు ముద్దలు మింగితే ఎంతటి ఎండైనా ఇట్టే చల్లబడిపోతుంది.
పశ్చిమకృష్ణా చందర్లపాడు మండలంలో మారుమూల గ్రామం తుర్లపాడు. జనాభాలో యాదవులు ఎక్కువ. గ్రామంలో కాపు కుటుంబాలు, ముస్లిం కుటుంబాలూ వున్నాయి. ఊరి శివారున ఎలాగూ మాదిగవాడ వుంది.
కాపుల్లో పురంశెట్టి వాళ్లది పెద్ద కుటుంబం. రోటిపచ్చడి, గడ్ద పెరుగు తినాలంటే పురంశెట్టి సీతారామారావు ఇంటికి వెళ్ళాల్సిందేనని జనం చెప్పుకునేవారు. వాళ్ళింటి భోజనం ముందు పెద్దపెద్ద హోటళ్ళు కూడ దిగదుడుపేనని మెచ్చుకునేవారు.
చివరిబ్ఃఉములు కావడాన చాలా కాలం ఊరికి సాగర్ నీళ్ళు రాలేదు. అయితేనేం ఊరి మొదట్లో పంచాయితీరాజ్ వాళ్లది పెద్ద చెరువుంది. చెరువు కింద వెయ్యెకరాల ఆయకట్టు. తాగుకూ, సాగుకూ కూడా తుర్లపాడుకు చెరువే పెద్ద దిక్కుగా వుండేది.
సీతారామారావుది పదెకరాల మాగాణి. చేలంతా వరి. ఇంటి నిండా పాడి.
అదెకరాల ఆసామి అన్నానికి కరువొస్తుందని ఊహించలేదుకానీ, కాలం కాటేసింది. పశ్చిమకృష్ణాలో కరువొచ్చింది. ఒకరోజు రెండురోజులు కాదు ఏకంగా పధ్ధెనిమిది నెలలపాటు ఊరికి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. తుర్లపాడు చెరువు కడుపుకోతతో బీటలువారింది. వేసిన పంటలు దూసుకుపోయాయిపంట వేయని చేళ్ళు బీళ్లయిపోయాయి. గడ్డి లేక, నీళ్ళు లేక పశువులు విలవిల్లాడిపోయాయిబక్కచిక్కి బొమికలు బయటికి వచేసిన జీవాల్ని సంతలకు తోలెయ్యక తప్పలేదు.
వాడలో కూలీలు ఎక్కడ పనిదొరికితే అక్కడికి వెళ్ళిపోగా, ఊర్లో రైతులు కొత్త కూలీలుగా మారిపోయారు. గడ్డపెరుగు తిని బతికిన ఊర్లో గడ్డపార పట్టుకుని పనికిపోవడానికి పురంశెట్టివాళ్ళకు అభిమానం అడ్డొచ్చింది.
రైతుల భిమానంతో బ్యాంకులకూ, విద్యుత్ శాఖకూ పనిలేకుండాపోయింది. బకాయిలు చెల్లించాలనీ, బిల్లులు కట్టాలనీ వాళ్ళు వత్తిడి తెచ్చారు. బ్యాంకులవాళ్ళు పొలాలు జప్తు చేస్తామని బెదిరిస్తే, కరెంటువాళ్ళు ఏకంగా మోటారు స్టార్టర్లు ఎత్తుకుపోయారు.
పరిస్థితి చెయ్యిదాటక ముందే పురంశెట్టివాళ్ళు కళ్ళు తెరిచారు. తెల్లవారేలోపునే ఇళ్లకు తాళాలు పెట్టి పది కుటుంబాలవారు హైదరాబాద్ బస్సు ఎక్కారు.
రెండేళ్ళక్రితం ఇళ్ళు కళకళలాడేవి. వాళ్ల పొలాలు పచ్చపచ్చగా వుండేవి. ఇప్పుడు అదంతా గతమైపోయింది. ఇప్పుడు అదంతా గతమైపోయింది. కథై కూర్చుంది.
పురంశెట్టివాళ్ల కుటుంబాలు హైదరాబాద్ లో అయినా క్షేమంగా వున్నాయా అని ఎవరికైనా సందేహం రావచు. దీనికి సమాధానం ఇమాంసా చెప్పగలడు.
వలసపోవడానికి కూడా ఒక వయసుండాలి. వయస్సును ఎన్నడో దాటిపోయాడు షేక్ ఇమాంసా. తెలిసినవాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోతే, ఊరి చెరువు గట్టున మిగిలిపోయాడతను.
బాగా బతికిన కుటుంబం గుర్తు చేసుకుంటుంటాడతను; పురంశెట్టివాళ్ళు గుర్తుకొచ్చినప్పుడెల్లా. హైదరాబాద్ లో తోపుడు హోటళ్ళు పెట్టుకున్నారట. ఎల్బీ నగర్ లో ఇడ్లీలు, అట్లు అమ్ముతున్నారట అనుకుంటుంటాడతను బాధగా.
సిటీవాళ్ళకు మన పచళ్ళు , గడ్డ పెరుగు అంటే  మహాఇష్టం. పురంశెట్టి ఆడవాళ్ళు పచళ్ళు బాగా చేస్తారు
అలా అనుకుంటున్నప్పుడెల్లా  ఇమాంసా కళ్ళెంట గ్యాపకాలు ధారగా కారుతుంటాయి.


విజయవాడ
3 మార్చి 2003
ప్రచురణ : ఆంధ్రప్రభ దినపత్రిక, 4 మార్చి 2003